Turuvanatapuram: చర్చలకు రండి... ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి కేరళ సీఎం ఆహ్వానం
- అయ్యప్ప భక్తులకు సౌకర్యాల కల్పనపై చర్చలు
- సమావేశంలో పాల్గొననున్న ఐదు రాష్ట్రాల సీఎంలు, దేవాదాయశాఖ మంత్రులు
- రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను హాజరవుతున్నట్లు వెల్లంపల్లి వెల్లడి
ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టేందుకు కేరళ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వివరాలు మంత్రి మీడియాకు వివరించారు. భక్తులకు సౌకర్యాల కల్పనపై కేరళ సీఎం పినరయి విజయన్ ఈ నెల 5న తిరువనంతపురంలో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇందులో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు దేవాదాయ శాఖ మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కేరళ సీఎం పినరయి విజయన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపారన్నారు. ప్రభుత్వం తరపున తాను ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. అయ్యప్ప స్వాముల కోసం శబరిమలలో అతిథి గృహం, వసతి నిర్మాణానికి స్థలం కేటాయించమని కేరళ ప్రభుత్వాన్ని గతంలో కోరినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో ఈ నెల 17 నుంచి మండల, మకరవిలక్కు ఉత్సవాలు జరగనున్నాయని, ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ జరుగనుందని తమ ప్రతిపాదనలతో రమ్మని విజయన్ తన లేఖలో కోరారని తెలిపారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం ముందు తాము కొన్నిప్రతిపాదనలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదనల వివరాలు ఇలా ఉన్నాయి.
- అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలి.
- రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో కలిపి నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల సమాచార వ్యవస్థ తో పాటు తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి...
- పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై స్పష్టంగా తెలుగు భాషలో రాయాలి.
- నీలకంఠ, పంబ సన్నిధి వద్ద అయ్యప్ప భక్తులకు తాగునీరు, భోజన, అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలి.
- అదనంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి.