Pawan Kalyan: పవన్ కు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలి: మంత్రి అవంతి
- లాంగ్ మార్చ్ పై మంత్రి అవంతి స్పందన
- పవన్ 2 కిమీ కూడా నడవలేకపోయాడని ఎద్దేవా
- పుస్తకాలు చదివినవాళ్లందరూ నేతలు కాలేరని వ్యంగ్యం
విశాఖలో పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఆదివారం జరిగిన సభలో పవన్ అనుభవలేమి, అజ్ఞానం బయటపడ్డాయని, పవన్ ఓ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరూ రాజకీయనాయకులు కాలేరు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం తపన పడుతున్న పవన్ కల్యాణ్ ఓ సినిమా ఉచితంగా చేశాననుకుని ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వవచ్చు కదా? అంటూ హితవు పలికారు.
పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటికే పరువు కోల్పోయిన పవన్, ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం ద్వారా మరింత దిగజారిపోతున్నాడని విమర్శించారు. పవన్ ఇంకా సినిమా మాయలోనే ఉన్నాడని, వైసీపీ నేతలకు ఇసుక రవాణాతో సంబంధం ఉందని నిరూపించాలని సవాల్ విసిరారు. లాంగ్ మార్చ్ అని చెప్పి కేవలం 2 కిలోమీటర్లు కూడా నడవలేకపోయారని, కానీ సీఎం జగన్ 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని తెలిపారు.