Sharada: ఆ పొరపాటు చేసినందుకు శారద పడి పడి నవ్వుకున్నారట!
- శారద గారికి అభినందన సభ జరిగింది
- వేదికపై ఆమె శ్రద్ధాంజలి అన్నారు
- దానికి అర్థం చెప్పేసరికి నవ్వేశారన్న ఈశ్వర్
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ తాజాగా శారద గురించి మాట్లాడుతూ ఒక సరదా సంఘటన గురించి ప్రస్తావించారు. "ఒకసారి శారద గారికి 'ఉత్తమనటి' అవార్డు లభించినప్పుడు చెన్నై లోని 'సవేరా' హోటల్లో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శారదగారు మాట్లాడుతూ, తనకి నటనలో ఓనమాలు నేర్పించిన ఎల్వీ ప్రసాద్ గారికి 'కృతజ్ఞతాంజలి' అనీ .. ఫలానావారికి 'వినయాంజలి' అని .. ఇలా చివర్లో 'అంజలి' అని వచ్చేట్టుగా రాసుకుని తన మనసులోని మాటను చెబుతూ వెళుతున్నారు.
చివర్లో 'నాకు అన్ని విధాలుగా సహకరించిన నా భర్త చలం గారికి శ్రద్ధాంజలి' అనేశారు. ఆ మాటకి నేను ఉలిక్కిపడ్డాను. ఆ తరువాత నేను శారదగారిని కలిసినప్పుడు, ఆమె చలం గారికి శ్రద్ధాంజలి అనడం గురించి ప్రస్తావించాను. బతికున్నవారికి శ్రద్ధాంజలి అనకూడదండి అని చెప్పాను. "అయ్యో శ్రద్ధాంజలి అంటే శ్రద్ధగా అంజలి ఘటించడం అనుకున్నానండి .. మీరు చెప్పేవరకూ నాకు తెలియదు' అంటూ ఆమె పడి పడి నవ్వేశారు' అని చెప్పుకొచ్చారు.