Crime News: యజమాని ఎత్తుకు పనివాడి పైఎత్తు.. బస్సు పార్సిల్‌ ద్వారా పంపిన రూ.20 లక్షలతో జంప్!

  • డెయిరీఫాం నిర్వాహకుడికి సహాయకుడి టోకరా
  • యజమాని అతి తెలివిని అనుకూలంగా మార్చుకున్న నిందితుడు
  • అతని వివరాలు కూడా తెలియవనడంతో అవాక్కయిన పోలీసులు

పెద్ద మొత్తంలో సొమ్ము బ్యాంకు లావాదేవీల ద్వారా తరలిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావించిన ఓ డెయిరీఫాం యజమాని దానిని అట్టపెట్టెలో పెట్టి మామూలు పార్కిల్‌ రూపంలో రప్పించే ప్రయత్నం చేశాడు. దీన్ని గుర్తించిన యజమాని పనివాడు ఆ డబ్బును తెలివిగా చేజిక్కించుకుని వుడాయించాడు.

వివరాల్లోకి వెళితే... ఒంగోలుకు చెందిన బిలాల్‌ అనే వ్యక్తికి యరజర్లలో డెయిరీ ఫాం ఉంది. ఇతని వద్ద విజయవాడకు చెందిన శ్రీరామ్‌ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. విశాఖకు చెందిన వ్యక్తి భాగస్వామ్యంతో బిలాల్‌కు ఒంగోలు గాంధీరోడ్డులో మరో డెయిరీ ఫాం కూడా ఉంది. ఈ ఫాం కోసం కొత్తగా గేదెలు కొనాలని భావించిన బిలాల్‌  తన  భాగస్వామికి రూ.20 లక్షలు పంపాలని కోరాడు. ఆ డబ్బును ఓ అట్టపెట్టెలో సరుకుల్లా పెట్టి, ట్రావెల్‌ బస్సుకు అందించాలని సూచించాడు.

విశాఖ భాగస్వామికి తన యజమాని సెల్‌ఫోన్‌లో చెబుతున్న విషయాలను శ్రీరాం జాగ్రత్తగా విన్నాడు. విశాఖ భాగస్వామి బిలాల్‌ చెప్పినట్టే 20 లక్షలు అట్టపెట్టెలో పార్సిల్‌ చేసి ఈనెల ఒకటిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు అందించాడు. రెండో తేదీన ఈ బస్సు ఒంగోలు చేరాల్సి ఉన్నా రాలేదు.

ట్రావెల్‌ సంస్థకు బిలాల్‌ తన సహాయకుడు శ్రీరామ్‌తో కలిసి వెళ్లి ఆరాతీశాడు. అనివార్య కారణాల వల్ల బస్సు రద్దయిందని, రేపు వస్తుందని కార్యాలయం సిబ్బంది చెబుతూ బస్సు డ్రైవర్‌ నంబర్‌ను బిలాల్‌కు ఇచ్చారు. ఈ నంబర్‌ను జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్న శ్రీరామ్‌ మరునాడు తెల్లవారు జామున ఐదు గంటలకే ఒంగోలు బస్టాండ్‌కు చేరుకున్నాడు.

బస్సు 5.30 గంటలకు రాగానే బస్సు డ్రైవర్‌కు తన యజమాని నంబర్‌ చెప్పాడు. బిలాల్‌ తన ప్రతినిధిని పంపాడని భావించి డ్రైవర్‌ ఆ పార్సిల్‌ను శ్రీరాంకు ఇచ్చేశాడు. ఈ విషయం తెలియని బిలాల్‌ ఉదయాన్నే ఒంగోలు ట్రావెల్‌ ఆఫీస్‌కు వచ్చి పార్సిల్‌ కోసం ఆరాతీశాడు. అక్కడి సిబ్బంది తెల్లవారు జామునే పార్సిల్‌ ఇచ్చేసిన విషయం తెలియడంతో కంగుతిన్నాడు.

పార్సిల్‌లో 20 లక్షల నగదు ఉందని చెప్పడంతో కార్యాలయం సిబ్బంది కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే బిలాల్‌ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి పేరు శ్రీరామ్‌ అని, అతనిది విజయవాడ అని మాత్రమే తెలుసని, అంతకు మించి వివరాలు తెలియవని పోలీసులకు చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.

  • Loading...

More Telugu News