New Delhi: ఢిల్లీలో నేటి నుంచి సరి-బేసి విధానం.. సీఎం కూడా పాటించాల్సిందే!
- ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
- ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరి-బేసి విధానం
- నేడు సరి సంఖ్యల వాహనాలనే రోడ్డుపైకి అనుమతి
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో నేటి నుంచి సరి- బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. నేటి నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. ఆదివారం ఈ నిబంధన ఉండదు. ఇందులో భాగంగా నేడు సరి సంఖ్యల వాహనాలనే రోడ్డుపైకి అనుమతిస్తున్నారు.
ఈ విధానాన్ని పాటించకపోతే రూ.4 వేల జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే, ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. గతంలోనూ ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ఢిల్లీ సీఎం, మంత్రులు మాత్రం సరి-బేసి విధానాన్ని పాటించాల్సిందే.