actress meera mithun: తమిళ బిగ్‌బాస్ షోపై నటి మీరా మిథున్ తీవ్ర ఆరోపణలు.. సంచలన ప్రకటన
![](https://imgd.ap7am.com/thumbnail/tn-96399db7c240.jpg)
- షో నుంచి బయటకు వచ్చి నెల రోజులు అయినా ఒక్క పైసా ఇవ్వలేదు
- రాష్ట్రంలో నాకు భద్రత లేకుండా పోయింది
- త్వరలోనే రాజకీయాల్లోకి..
తమిళ బిగ్‌బాస్-3పై నటి మీరా మిథున్ తీవ్ర ఆరోపణలు చేసింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తనకు రావాల్సిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా చెల్లించలేదని, నిర్వాహకులను అడిగినా సరైన సమాధానం లేదని వాపోయింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, నేరుగా వెళ్లి అడిగినా స్పందించడం లేదని పేర్కొంది. అంతేకాక, డబ్బులు అడిగినందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. కాబట్టి తనకు కోటి రూపాయలను పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఇటీవల తాను అందాల పోటీలు నిర్వహించినప్పుడు పోలీసులు అడ్డుకుని ఫైనల్స్ జరగకుండా ఆపేశారని ఆరోపించింది. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో తనకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నానని సంచలన ప్రకటన చేసింది. అయితే, ఏ పార్టీలో చేరబోతున్నదీ త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొంది.
బిగ్‌బాస్-3 రియాలిటీ షోపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ షోలో పాల్గొన్న హాస్యనటి మధుమిత కూడా విజయ్ టీవీపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పారితోషికం ఇవ్వలేదని, హౌస్‌లో తనకు న్యాయం జరగలేదని విమర్శించింది. ఇప్పుడు అదే కోవలో నటి మీరా మిథున్ ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది.