Nagababu: ఓ పిట్ట కథతో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో ఏది బెటరో చెప్పిన నాగబాబు!
- వైజాగ్ లో లాంగ్ మార్చ్ కు హాజరైన నాగబాబు
- సభా వేదికపై నుంచి ప్రసంగం
- పిట్టకథతో సభికులను అలరించిన మెగాబ్రదర్
విశాఖపట్నంలో జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ ర్యాలీ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేలాదిగా భవన నిర్మాణ కార్మికులు, జనసేన కార్యకర్తలతో ర్యాలీ మద్దిలపాలెం సెంటర్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం దిశగా సాగుతోంది. ర్యాలీ ముగిసిన వెంటనే బహిరంగ సభ ఉంటుంది. ఈ సభ కోసం ఓల్డ్ జైల్ రోడ్ లోని ఉమెన్స్ కాలేజి ఎదుట వేదిక నిర్మించారు. అక్కడి నుంచి మెగాబ్రదర్ నాగబాబు తన ప్రసంగం వినిపించారు. తన స్పీచ్ చివర్లో ఓ చిన్న పిట్టకథతో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో ఏది బెటరో చెప్పారు.
పిట్టకథ ఆయన మాటల్లో ఇలా సాగింది. "ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. వాడు వచ్చేపోయేవాళ్లను అస్తమానం తిడుతూ ఉండేవాడు. వాడి దెబ్బకు జనాలు హడలిపోయేవాళ్లు. ఏంట్రా బాబూ, వీడి తిట్లు భరించలేకపోతున్నాం, ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడు చస్తే బాగుండు అనుకునేవాళ్లు. కొన్నాళ్లకు వాడు చచ్చిపోయే టైమ్ వచ్చింది. అప్పుడు తన కొడుకును పిలిచి నాకు మంచి పేరు తీసుకురావాలని అని కోరాడు. జనాలను ఎంతో హింసించిన వీడికి నేనెలా మంచి పేరు తీసుకురావాలి అని ఆ కొడుకు బాగా ఆలోచించాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ వచ్చేపోయేవాళ్లను లాగి తన్నడం మొదలుపెట్టాడు. అప్పుడు ఊళ్లో ప్రజలు వీడికంటే వీడి బాబే నయంరా అన్నారు. వాడు తిట్లతో సరిపెట్టేవాడు, వీడు కొడుతున్నాడు అనుకునేవాళ్లు. ఈ కథలో బాబు తెలుగుదేశం అయితే, తన్నేవాడు వైసీపీ" అంటూ తన ప్రసంగం ముగించారు.