Nagababu: ఇసుక ఇంత కొంప ముంచుతుందని వైసీపీ నేతలు ఊహించి ఉండరు: లాంగ్ మార్చ్ లో నాగబాబు వ్యాఖ్యలు
- విశాఖలో జనసేన లాంగ్ మార్చ్
- హాజరైన నాగబాబు
- వైసీపీ సర్కారుపై విమర్శలు
రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవడం, పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం పట్ల స్పందిస్తూ జనసేన పార్టీ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తోంది. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ భారీ ర్యాలీ భారీ జనసందోహంతో ముందుకు కదులుతోంది. కాగా, మెగాబ్రదర్ నాగబాబు బహిరంగ సభ వేదిక వద్ద నుంచి మాట్లాడుతూ, ఇసుక ఇంత కొంప ముంచుతుందని వైసీపీ నేతలు కూడా ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే వాళ్ల దుంప తెగే పరిస్థితి వచ్చిందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు 32 లక్షల మందే అన్నారని, కానీ కోటి మందికి పైగా ఉన్న విషయం వైసీపీ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం నిలదొక్కుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావించాడని, కానీ, వైసీపీ వాళ్లే పోరాటానికి ఓ అవకాశం ఇచ్చారని, అందుకు ధన్యవాదాలని నాగబాబు పేర్కొన్నారు. కర్ణాటకలో ఓ ఆలయం ప్రారంభోత్సవానికి వెళితే పవన్ కల్యాణ్ కు అక్కడి ప్రభుత్వం 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తే ఇక్కడ 90 మంది పోలీసులను కూడా ఇవ్వలేదని, కేవలం 70 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారని విమర్శించారు. కానీ, పది మంది పోలీసులను ఇచ్చినా జనసేన తలపెట్టిన కార్యం మాత్రం జరిగిపోతుందని స్పష్టం చేశారు.
జనసేన తరఫున తాము చేస్తున్న ప్రధాన డిమాండ్ ను కూడా నాగబాబు వివరించారు. ఇసుక అంశం ఓ కొలిక్కి వచ్చే వరకు భవన నిర్మాణ కార్మికులకు కొంత మొత్తం పరిహారంగా చెల్లించాలని కోరారు. మత్స్యకారులకు వేట నిషేధం సమయంలో ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందని, భవన నిర్మాణ కార్మికులకు కూడా అదే విధంగా పది వేలో, పదిహేను వేలో చెల్లించాలన్నారు. ప్రభుత్వమో, ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు విధానాల వల్ల కొన్ని జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు.