Narendra Modi: దేశాభివృద్ధిలో పన్ను చెల్లింపుదారుల పాత్ర చాలా గొప్పది: మోదీ
- థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో పర్యటిస్తోన్న మోదీ
- ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల్లో ప్రధాని ప్రసంగం
- స్నేహపూర్వక పన్ను వ్యవస్థ ఉన్న దేశంగా భారత్
- విదేశీ పెట్టుబడులకు భారత్ ఓ మంచి గమ్యస్థానం
మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ కు చేరుకున్న విషయం తెలిసిందే. రెండో రోజున తన పర్యటనలో భాగంగా ఆయన ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... ఐదేళ్లలో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. దేశాభివృద్ధిలో పన్ను చెల్లింపుదారుల పాత్ర చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. స్నేహపూర్వక పన్ను వ్యవస్థ ఉన్న దేశంగా నేడు భారత్ నిలిచిందని అన్నారు.
ప్రత్యేక నగదు బదిలీ విధానం ద్వారా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మోదీ అన్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఓ మంచి గమ్యస్థానంగా మారిందని ఆయన తెలిపారు. భారత్ లో సులభతర వాణిజ్య విధానం ఎన్నడూ లేనంతగా మెరుగుపడిందని ఆయన చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా తాము సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.