Ravichandran Ashwin: మనం తీసుకునే ఊపిరిలో ఆక్సిజన్ తగు మోతాదులో ఉండాలి, ఇక్కడ అలా లేదు: టీమిండియా బౌలర్ అశ్విన్
- ఢిల్లీలో ప్రమాదకర స్థితికి చేరిన వాయు కాలుష్యం
- గాలిలో క్షీణించిన నాణ్యత
- పరిస్థితి భీతావహంగా ఉందన్న అశ్విన్
ఢిల్లీలో రేపు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. అయితే కొన్నిరోజులుగా దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినట్టు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్న నేపథ్యంలో, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా మనిషి తీసుకునే ఊపిరిలో తగినంత ఆక్సిజన్ ఉండాలని, కానీ, ఢిల్లీ గాలిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ట్వీట్ చేశాడు. ఢిల్లీ గాలిలో నాణ్యత క్షీణించిందని, పరిస్థితి భీతావహంగా ఉందని పేర్కొన్నాడు.
అంతకుముందు, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో మాట్లాడుతూ, వాయు కాలుష్యంతో తామేమీ ఇబ్బంది పడబోమని, మ్యాచ్ సజావుగానే జరుగుతుందని భరోసా ఇచ్చాడు. అటు, బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో కూడా ఇదే తరహాలో అభిప్రాయం వెలిబుచ్చాడు. 'కాలుష్యం ఉన్న మాట నిజమే అయినా, మూడు గంటలు మైదానంలో గడిపినంత మాత్రాన చచ్చిపోము కదా?' అంటూ వ్యాఖ్యానించాడు.