APSRTC: ఆర్టీసీ విభజన జరగలేదు, మనమింకా ఏపీ ఎస్ఆర్టీసీలోనే ఉన్నాం: కార్మికులతో అశ్వత్థామరెడ్డి
- లక్ష్మణ్ నివాసంలో విపక్ష, ఆర్టీసీ నేతల భేటీ
- ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చెల్లవన్న అశ్వత్థామరెడ్డి
- కార్మికులు భయపడాల్సిన పనిలేదంటూ భరోసా
తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ నివాసంలో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కోదండరాం తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, ఆర్టీసీ విభజన జరగలేదని, తామిప్పటికీ ఏపీఎస్ఆర్టీసీలోనే ఉన్నామని తెలిపారు. ఆర్టీసీ విభజన జరగని కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చెల్లదని స్పష్టం చేశారు. ఈ నెల 4 లేదా 5న ఢిల్లీ వెళ్లి ఆర్టీసీ వ్యవహారంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి తోడ్పడాలంటూ కేంద్రాన్ని కోరతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె నేటితో 29వ రోజుకు చేరుకుంది.