United Nations: కశ్మీర్ కంటే ముఖ్యమైన అంశాలు మాకు చాలా ఉన్నాయి!: భద్రతా మండలి
- కశ్మీర్ పై చర్చించమంటూ భద్రతామండలి ప్రకటన
- అంతకంటే ముఖ్యమైన చర్చనీయాంశాలున్నాయి
- గత సమావేశాల్లో కూడా భంగపడ్డ పాక్
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలన్న పాక్ కాంక్ష మరోసారి విఫలమైంది. ఈ నెలలో జరిగే తమ సమావేశాల్లో కశ్మీర్ పై చర్చ ఉండబోదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. ఈ సమావేశానికి సమితిలో బ్రిటన్ శాశ్వత ప్రతినిధిగా ఉన్న కరెన్ పియర్స్ అధ్యక్షత వహించనున్నారు.
ఇటీవల కశ్మీర్ పై చర్చించామని చెబుతూ... ఈసారి సమావేశం ఎజెండా అంశాల్లో దాన్ని చేర్చలేదని కరెన్ తెలిపారు. కశ్మీర్ కంటే ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఆగస్టులో కశ్మీర్ పై చర్చకు పాకిస్తాన్, చైనాలు పట్టుబట్టగా భద్రతా మండలి రహస్యంగా సమావేశాలు చేపట్టినప్పటికి సభ్యదేశాలు దీనిపై ఎటువంటి తుది ప్రకటన చేయలేదు. సమావేశంలో పాల్గొన్న సభ్యుల్లో చాలామంది ఇది భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమన్నారు.