Jana Sena: తమ ఇళ్లకు రావొద్దంటూ గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి.. కిడ్నాప్‌కు యత్నం!

  • సఖినేటిపల్లి మండలంలో ఘటన
  • గ్రామస్థులు వెంబడించడంతో కారు నుంచి వలంటీర్‌ను కిందికి తోసేసిన వైనం
  • అనుచరులతో కలిసి హెచ్చరించిన జనసేన కార్యకర్త

గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడడమే కాకుండా కిడ్నాప్‌కు యత్నించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం, గుడిమూల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని హెచ్చరించిన గ్రామానికే చెందిన కొందరు జనసేన పార్టీ కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. అంతేకాక, రాజేశ్ అనే వలంటీరును కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌‌‌కు యత్నించినట్టు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వలంటీర్లు రాజేశ్, సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుపు రంగు స్విఫ్ట్ కారులో వచ్చిన జనసేన కార్యకర్తలు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని అయితే, స్థానికులు వెంబడించడంతో  గొంది గ్రామం వద్ద కారు నుంచి తనను కిందికి తోసేసినట్టు రాజేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాజేశ్, సునీల్‌లు ఇటీవల గ్రామంలో సర్వే నిర్వహించగా జనసేన కార్యకర్త నాయుడు కృష్ణస్వామి తన అనుచరులతో కలిసి అడ్డుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jana Sena
East Godavari District
village volunteer
  • Loading...

More Telugu News