Vellampalli: తెలుగు ప్రజలను విడదీసిన పాపం చంద్రబాబుదే: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

  • వైసీపీతోనే ఆర్యవైశ్యుల అభ్యున్నతి అని వ్యాఖ్యలు
  • అమరజీవి త్యాగంపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరమన్న మంత్రి
  • పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని వెల్లడి

తెలుగు ప్రజలను విడదీసిన పాపం చంద్రబాబుదేనని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నవంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.  ఈరోజు అర్బన్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ సామారంగ్ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

ఈ సందర్భంగా ఆర్య వైశ్య ప్రముఖులు మరియు వైసీపీ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం చిన్నారులకు మంత్రి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విభజన బిల్లు అసెంబ్లీలో పెట్టాలని ఒత్తిడి తెచ్చారని,  తెలుగు ప్రజలను విడగొట్టిన పాపం చంద్రబాబుదే అని అన్నారు. రాజకీయాల్లో నలబై ఏళ్ల అనుభవం ఉందంటున్న చంద్ర బాబు, నవంబర్ ఒకటికి, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగానికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించటం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు.  

చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు అమరజీవిని విస్మరించిన విషయం నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ‘మీరు సిఎం గా ఉన్నప్పుడు నవంబర్ ఒకటిన అమరజీవిని స్మరించారో, లేదో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించటానికి తేదీలను లెక్క బెట్టుకుంటూ.. జూన్ రెండు, అక్టోబర్, నవంబర్ అంటూ కాలం వెళ్లబుచ్చారని విమర్శించారు. 

వైఎస్సార్  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాను అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. నేడు వారి తనయుడు సీఎం జగన్ నవంబర్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహిస్తున్నారన్నారు.  తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.

 ఆర్య వైశ్యు లు జగన్ పాదయాత్ర సమయంలో కలిసి నవంబర్ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని పలు మార్లు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఆ హామీ అమలులో భాగంగా నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల తరువాత మొదటి సారిగా రాష్ట్ర అవతరణ  వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. 

ఈ కార్యక్రమం లో అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, వైసీపీ నేతలు పైలా సోమి నాయుడు, మండేపూడి చటర్జీ, ఆర్య వైశ్య సంఘం నాయకులు కటకం కృష్ణకుమార్, వాసుదేవరావు, కొండపల్లి మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, గుడిపాటి పాపారావు, నారాయణ, సుబ్బారావు, కందుకూరి సుబ్బారావు, ఆర్య వైశ్య మహిళా నాయకులు, వైసీపీ డివిజన్ అధ్యక్షులు గ్రంథి బుజ్జి, వెన్నం రజని, గుడివాడ నరేంద్ర, మురళీ, మాజీ కార్పొరేటర్ అప్పాజీ, మైలవరపు దుర్గా రావు, పదిలం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News