abu bakar al bagdadi: మా చీఫ్ చనిపోయాడు.. ధ్రువీకరించిన ఐసిస్: అమెరికాపై ప్రతీకారం తప్పదని హెచ్చరిక
- ఆడియో టేప్‌ను విడుదల చేసిన ఐసిస్
- కొత్త చీఫ్‌గా ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషి
- అమెరికా సైన్యం రహస్య ఆపరేషన్‌లో బగ్దాదీ హతం
ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ హతమయ్యాడంటూ అమెరికా చేసిన ప్రకటనను ఐసిస్ ధ్రువీకరించింది. బగ్దాదీ మృతి నిజమేనని నిర్ధారించింది. ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేసిన సంస్థ.. ఐసిస్‌కు కొత్త చీఫ్‌ను కూడా ప్రకటించింది. బగ్దాదీ వారసుడిగా ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషిని నియమించినట్టు పేర్కొన్న ఉగ్రవాద సంస్థ అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. అలాగే, 2016 నుంచి ఐసిస్‌కు ప్రతినిధిగా ఉన్న బగ్దాదీ అనుచరుడు అబు హసన్ అల్ ముహజిర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు ఐసిస్ తెలిపింది.
వీరిద్దరి చావుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాగా, సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో ఆదివారం అమెరికా సైన్యం చేపట్టిన రహస్య ఆపరేషన్ సందర్భంగా బగ్దాదీ మరణించాడు. అమెరికా దళాలు చుట్టుముట్టడంతో వారికి సజీవంగా దొరకడం ఇష్టం లేని బగ్దాదీ, అతడి భార్య ఒంటికి పేలుడు పదార్థాలు అమర్చుకుని పేల్చేసుకున్నారు.