BCCI: ఖాతాల్లో డబ్బుల్లేక అయోమయంలో భారత మహిళా క్రికెటర్లు... ఇంఛార్జి నిర్వాకం ఫలితం!
- మహిళా క్రికెట్ జట్టు ఇన్ చార్జి సాబా కరీం నిర్లక్ష్యం
- కరీం చేతికి సెప్టెంబర్ 18నే ఆర్థిక వ్యవహారాల నిర్వహణ
- బీసీసీఐ కొత్త కార్యవర్గం జోక్యంతో సమస్య పరిష్కారం
ఖాతాల్లో నగదు ఉందనుకుని భారత మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్ కు బయలు దేరింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తమకు ఇవ్వాల్సిన డైలీ అలవెన్స్ ఖాతాల్లో జమకాకపోవడంతో క్రికెటర్లు కంగుతిన్నారు. దీనిపై క్రికెటర్లు బీసీసీఐకి తెలిపారు. దీంతో బీసీసీఐ అధికారులు మహిళా క్రికెట్ జట్టుకు ఇంఛార్జీగా ఉన్న మాజీ క్రికెటర్, భారత క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సాబా కరీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇది చాలా సున్నితమైన విషయం. మన మహిళా జట్టు విదేశీ గడ్డపై అడుగుపెట్టినప్పుడు కనీసం వారి అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా లేకుండా పంపుతారా.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సెప్టెంబర్ 18నే ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యత పాలన కమిటీ నుంచి మీ చేతికి వచ్చినప్పటికి.. ఎందుకంత నిర్లక్ష్యం వహించారు?’ అంటూ క్లాస్ పీకారు.
సమస్య పరిష్కారానికి బీసీసీఐ కొత్త కార్యవర్గం జోక్యం చేసుకుని, డీఏను ఆగమేఘాలపై బదిలీ చేయడంతో మహిళా క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. భారత మహిళా జట్టు విండీస్ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లను ఆడనుంది.