Maharashtra: ప్రతి ఒక్కరూ మాతో టచ్ లో వున్నారు.. అయినా తొందర పడడం లేదు: శివసేన చీఫ్ ఉద్ధవ్

  • అధికారంపై బీజేపీ, శివసేనల మధ్య కొనసాగుతున్న విభేదాలు
  • కాంగ్రెస్, ఎన్సీపీలతో టచ్ లో ఉన్నామంటున్న శివసేన 
  • ఏక్ నాథ్ షిండే శివసేన శాసనసభాపక్ష నేతగా  ఎన్నిక

మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు సీఎం పదవి నిర్ణీత కాలపరిమితిమేరకు చేపట్టడంపై శివసేనతో ఒప్పందం కుదుర్చుకోలేదని బీజేపీ చెబుతుండగా.. మరోవైపు ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ఎంతకైనా తెగిస్తామని శివసేన అంటోంది. ఈరోజు జరిగిన శివసేన శాసనసభాపక్ష సమావేశంలో ఏక్ నాథ్ షిండేను అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగా, సునీల్ ప్రభును చీఫ్ విప్ గా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ‘శివ సైనికుడే మహారాష్ట్రకు సీఎం కానున్నాడు’ అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై తమకు తొందరలేదని చెపుతూ.. మీలో ఎవరికైనా తొందరగా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో సహా, ప్రతీ ఒక్కరూ తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు.

‘బీజేపీ సమస్య మాకు తెలుసు. అదేవిధంగా మా సమస్యలు వారు తెలుసుకోవాలి. మేము కూడా పార్టీని నడిపించాల్సి ఉంటుంది కదా?’ అని ఆయన అన్నారు. ఇటీవలే బీజేపీ, తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎన్నుకుంది. ఈ సందర్భంగా ఆయన ‘సీఎం పదవిపై శివసేనతో ఒప్పందం చేసుకోలేదు’ అని వ్యాఖ్యానించడంతో,  శివసేన విమర్శల బాట పట్టింది.

288 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాలసిన సంఖ్య 145. బీజేపీకి 105 స్థానాలు రాగా అధికారానికి మరో 40 స్థానాల దూరంలో ఉంది. శివసేన వద్ద 56 స్థానాలున్నాయి. బీజేపీ తన వైఖరిని మార్చుకోకుంటే శివసేన.. 44 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్,  54 స్థానాలు సొంతం చేసుకున్న ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడాలని యోచిస్తోంది. శివసేన తమతో కలిసి రావడానికి ఒప్పుకుంటే ఎన్సీపీని కూడా తాము ఒప్పిస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News