Nara Lokesh: ఈ ఐదు నెలల్లో జగన్ సాధించింది ఇదొక్కటే: లోకేశ్ విసుర్లు
- రాష్ట్రానికి మానవ హక్కుల కమిషన్ ను తీసుకువచ్చాడని ఎద్దేవా
- మార్ఫింగ్ వీడియోలతో అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించిన లోకేశ్
- దొంగ మీడియా, దొంగబ్బాయ్ అంటూ వ్యాఖ్యలు
రాష్ట్రంలో టీడీపీ నాయకులను అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదు నెలల్లో జగన్ సాధించింది ఒక్కటేనని, రాష్ట్రానికి మానవ హక్కుల కమిషన్ ను తీసుకువచ్చాడని ఎద్దేవా చేశారు. ఇవాళ వాళ్లకు కూడా రాష్ట్రంలో సరైన ఏర్పాట్లు చేయలేకపోతున్నారని విమర్శించారు.
దెందులూరు నియోజకవర్గాన్ని స్వంత నిధులతో అభివృద్ధి చేసిన చింతమనేని ప్రభాకర్ వంటి వ్యక్తులను కూడా వదలడం లేదని, ఆయనను జైల్లో ఉంచి 51 రోజులైందని అన్నారు. మార్ఫింగ్ చేసిన వీడియోలు ఆధారంగా చేసుకుని ఎలా అరెస్ట్ చేస్తారంటూ లోకేశ్ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ దొంగ పేపరు, ఓ దొంగ చానల్ ఉన్నాయని, వాటిని పెట్టింది ఓ దొంగబ్బాయ్ అని పరోక్షంగా ఓ మీడియా సంస్థపై వ్యాఖ్యలు చేశారు. ఆ మీడియాలో వచ్చే వార్తలను మీరు ఎలా సాక్ష్యాలుగా పరిగణిస్తారని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దొంగ కేసులు పెట్టినట్టయితే ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఇవాళ రోడ్లపై తిరిగేవాడు కాదని లోకేశ్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ కనీసం పాదయాత్ర కూడా చేయలేకపోయేవాడని అన్నారు. అయితే తాము జగన్ కు ఇబ్బంది కలగకూడదని, పాదయాత్ర సందర్భంగా అదనపు భద్రత కల్పించామని చెప్పారు.