Bhadradri Kothagudem District: గుప్త నిధుల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

  • ఇద్దరు వ్యక్తులతో కలిసి అటవీప్రాంతానికి వెళ్లిన హజమత్
  • జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి
  • శవాన్ని పాతిపెట్టిన వేటగాళ్లు

గుప్త నిధులు దొరికితే రాత్రికి రాత్రే సంపన్నుడు కావచ్చనే ఆశ... చివరకు ఆ వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అన్నపురెడ్డిపల్లి మండలం బూరుగుగూడెంకు చెందిన పఠాన్ హజమత్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గుప్త నిధుల కోసం అటవీప్రాంతంలోకి వెళ్లాడు.

అయితే, జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు హజమత్ కు తగిలాయి. దీంతో, విద్యుత్ షాక్ కు గురైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మరోవైపు, హజమత్ శవాన్ని వేటగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు.

జరిగిన ఘటనకు సంబంధించి హజమత్ తో వెళ్లిన మరో ఇద్దరు వ్యక్తులు నిన్న ఉదయం అన్నపురెడ్డిపల్లి పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

Bhadradri Kothagudem District
Treasure Hunt
  • Loading...

More Telugu News