Tamil Nadu: అతి తెలివితో అశ్లీల వీడియోలు పంపి అడ్డంగా బుక్ అయిన ట్రాఫిక్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్
- జరిమానా విధింపు సందర్భంగా నంబర్ల సేకరణ
- అనంతరం మహిళల ఫోన్ నంబర్లకు వీడియోలు
- బాధితులు నిలదీయడంతో వెలుగులోకి నిర్వాకం
అధికారం అందలం ఎక్కించినా బుద్ధి పాతాళంలో ఉందని నిరూపించాడు ఆ ట్రాఫిక్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్. విధి నిర్వహణలో భాగంగా లభించిన మహిళ ఫోన్ నంబర్లకు అశ్లీల వీడియోలు పోస్టుచేస్తూ అతి తెలివిగా వ్యవహరించాడు. బాధితులు నిలదీయడంతో విషయ నిర్థారణ జరిగి ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం వేలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో రాజామాణిక్యం అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వేలూరు, కాట్పాడి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుంటారు. ద్విచక్ర వాహన చోదకుల తనిఖీల సందర్భంగా నిబంధనలు పాటించని వారికి ఫైన్ విధించి రశీదుపై వారి ఫోన్ నంబర్లు రాస్తుంటారు.
ఈ విధంగా ఫైన్ విధించిన మహిళ ఫోన్ నంబర్లకు అనంతరం రాజామాణిక్యం అశ్లీల వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఫైన్ కట్టిన తర్వాత తమ నంబర్లకు అశ్లీల వీడియోలు రావడాన్ని గుర్తించిన కొందరు మహిళలు అనుమానంతో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ని నడిరోడ్డుపైనే నిలదీశారు.
ఈ వాగ్వాదాన్ని కొందరు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన వేలూరు డీఎస్పీ బాలకృష్ణన్ మహిళల ఆరోపణలు నిజమేనని నిర్థారణకు వచ్చారు. దీంతో రాజామాణిక్యంపై సస్పెన్షన్ వేటు వేశారు.