Kengarla Mallaiah: కవితను నమ్మి ఎన్నో బాధలను అనుభవించాం: కెంగర్ల మల్లయ్య
- కవిత వల్లే వేరే యూనియన్ కండువా కప్పుకోవాల్సి వచ్చింది
- నన్ను అడుగునా అవమానాలకు గురి చేశారు
- కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవితలపై భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుడు కెంగర్ల మల్లయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ కోల్పోయారని ఆయన అన్నారు. ఆ స్ఫూర్తిని ఆయన ఇకపై ఎన్నటికీ పొందలేరని చెప్పారు. టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) గౌరవాధ్యక్షురాలు కవిత వల్లే తాను మరో యూనియన్ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. కవితను నమ్మి తాము ఎన్నో బాధలను అనుభవించామని చెప్పారు. కొత్తగూడెంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఆవిర్భావికి ముందే తాను టీబీజీకేఎస్ ను స్థాపించానని మల్లయ్య తెలిపారు. ఆ తర్వాత తనను అడుగడుగునా అవమానాలకు గురి చేశారని, యూనియన్ ను పైరవీకారులకు అప్పగించారని చెప్పారు. చీమల పుట్టలో పాములు చేరినట్టు... టీబీజీకేఎస్ లో చొరబడ్డ కొన్ని శక్తులు యూనియన్ ను నాశనం చేశాయని మండిపడ్డారు.