Shilpa Shetty: డాన్ ఇక్బాల్ మిర్చ్ తో సంబంధాలు.. ఈడీ విచారణకు హాజరైన శిల్పా షెట్టి భర్త

- గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చ్ తో పాటు రాజ్ కుంద్రాపై ఆరోపణలు
- నవంబర్ 4న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ సమన్లు
- వ్యక్తిగత పనుల వల్ల ముందే హాజరైన కుంద్రా
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చ్ తో పాటు రాజ్ కుంద్రా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు విచారణ నేపథ్యంలో ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఈ ఉదయం 11 గంటలకు రాజ్ కుంద్రా చేరుకున్నారు. వాస్తవానికి నవంబర్ 4న విచారణకు హాజరుకావాలంటూ మనీలాండరింగ్ చట్టం కింద రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే, వ్యక్తిగత పనులు ఉన్న నేపథ్యంలో ముందుగానే విచారణకు రాజ్ కుంద్రా హాజరయ్యారు.
విచారణలో భాగంగా ఇక్బాల్ మిర్చ్ సన్నిహితుడు రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో రాజ్ కుంద్రాకు ఉన్న వ్యాపార లావాదేవీలపై ఈడా ప్రశ్నిస్తోంది. గతంలో ఈ కేసుపై రాజ్ కుంద్రా స్పందిస్తూ, తాను ఏ తప్పూ చేయలేదని తెలిపారు.

ఎస్సెన్సియల్ హాస్పిటాలిటీ సంస్థకు ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ ఇచ్చిన రూ. 3.46 కోట్ల లోన్ కు సంబంధించిన విషయాన్ని ఈడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో... ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ డైరెక్టర్లుగా శిల్పా షెట్టి, రాజ్ కుంద్రా ఉన్నట్టు ఈడీ గుర్తించింది. రంజీత్ బింద్రా కూడా మరో డైరెక్టర్ గా ఉన్నారు. బిట్ కాయిన్ స్కామ్ లో కూడా గత ఏడాది రాజ్ కుంద్రా విచారణను ఎదుర్కొన్నారు.