America: అంతరిక్షంలో రహస్య పరిశోధనలు చేసి తిరిగొచ్చిన అమెరికా వ్యోమనౌక!
- ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో దిగిన నౌక
- 780 రోజుపాటు భూకక్ష్యలో సంచారం
- వివరాలు మాత్రం వెల్లడించని అగ్రరాజ్యం
అమెరికా ఏది చేసినా ప్రపంచానికి ప్రత్యేకమే. అందుకు కారణం కూడా ఆ దేశం అనుసరించే పోకడలే. మూడో కంటికి తెలియకుండా చాలా ఆపరేషన్స్ నిర్వహించడం ఆమెరికాకు అలవాటు. ఇప్పుడు కూడా అటువంటి ఆపరేషన్‌నే పూర్తి చేసింది.
అంతరిక్షంలో తనకు కావాల్సిన రహస్య పరిశోధనలకు రెండేళ్ల క్రితం ఏకంగా ఎక్స్-37బి అనే వ్యోమనౌకను ప్రయోగించింది. 2017లో ప్రయోగించిన ఈ వ్యోమనౌక దాదాపు 780 రోజులపాటు భూకక్ష్యలో పరిభ్రమించి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ నౌకద్వారా అమెరికా ఏం సాధించింది, ఏ వివరాలు సేకరించిందన్న విషయాన్ని మాత్రం పెద్దన్న బయట పెట్టడం లేదు.
అంతరిక్షంలోకి పంపిన పునర్వినియోగ వాహక నౌకకు సంబంధించి ఇది రికార్డు కాలమని, తమ లక్ష్యాలన్నీ నెరవేరాయని మాత్రం అమెరికా ప్రకటించింది. ఓ స్పేస్ షటిల్‌లా ఉండే ఈ వ్యోమనౌకను ఇప్పటి వరకు రోదసిలోకి ఐదుసార్లు పంపించారు. వచ్చే ఏడాది మరోసారి ప్రయోగించనున్నారని సమాచారం. కాగా, తాజా ప్రయోగంలో అమెరికా తన వైమానిక దళ లేబొరేటరీకి సంబంధించిన కొన్ని ప్రయోగాలు చేసిందని తెలుస్తోంది.