Sea Level: మోగుతున్న ప్రమాద ఘంటికలు.. ముంబైకి ముంపు ముప్పు!
- ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న నీటి మట్టాలు
- 2050 నాటికి కనుమరుగు కానున్న 15 కోట్ల మంది నివసిస్తున్న భూభాగం
- తీవ్రంగా ప్రభావితం కానున్న ముంబై డౌన్ టౌన్
ప్రపంచ వ్యాప్తంగా సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా 2050 నాటికి పాత అంచనాల కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రజలు ప్రభావితమవబోతున్నారు. మన దేశం విషయానికి వస్తే ఆర్థిక రాజధాని ముంబైకి పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ వివరాలను అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న 'క్లైమేట్ సెంట్రల్' అనే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ చేసిన అధ్యయనానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్... 'నేచర్ కమ్యూనికేషన్స్' జర్నల్ లో ప్రచురితమైంది.
ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలతో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా పరిశోధకులు సముద్ర తీర ప్రాంతాల్లోని భూమి ఎత్తును చాలా కచ్చితంగా లెక్కించారని తెలిపింది. సముద్ర మట్టాలు పెరిగితే విశాలమైన భూ ప్రాంతాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేశారని పేర్కొంది. గతంలో ఉన్న అంచనాలకు తాజా అంచనాలకు చాలా దూరంలో ఉన్నాయని తెలిపింది.
కొత్త అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం 15 కోట్ల మంది నివసిస్తున్న భూభాగం... ఈ శతాబ్దం మధ్య కాలం (2050) నాటికి సముద్ర తీరాన్ని తాకే ఎత్తైన అలల కంటే తక్కువ ఎత్తులో ఉండబోతోంది. అంటే... ఈ ప్రాంతాలను సముద్రం ఆక్రమించుకోబోతోంది. ఇదే సమయంలో ముంబైకి పెను ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా చారిత్రాత్మకమైన డౌన్ టౌన్ (వాణిజ్యం జరిగే చోటు) ప్రాంతం తీవ్రంగా ప్రభావితం కానుంది. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో 'ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్' సంస్థకు చెందిన డీనీ లోనెస్కో మాట్లాడుతూ, అన్ని దేశాలు ఇప్పటి నుంచే ముందు చూపుతో చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపుకు గురి కాబోతున్న ప్రాంతాల్లోని ప్రజలకు ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ఇప్పటి నుంచే చేపట్టాలని చెప్పారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని... విపత్తు ముంచుకొస్తోందనే విషయం మనందరికీ తెలుసని అన్నారు.