Ranjan Gogoi: రానున్న 8 పనిదినాల్లో... అత్యంత కీలక తీర్పులను వెల్లడించనున్న సుప్రీంకోర్టు!

  • 17న పదవీ విరమణ చేయనున్న గొగోయ్
  • అత్యంత కీలకమైన రామజన్మభూమి కేసు
  • రాఫెల్, రాహుల్, శబరిమల కేసుల్లోనూ తీర్పు వెలువడే అవకాశం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎస్ఏ బాబ్డే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు కూడా. ఇక గొగోయ్ రిటైర్ అయ్యేలోపు దేశ గతిని మార్చే అత్యంత కీలక తీర్పులను ఆయన వెల్లడించనున్నారు. వాస్తవానికి నవంబర్ 17 వరకూ ఆయనకు సమయం ఉన్నా, సుప్రీంకోర్టు పనిచేసేది మాత్రం 8 రోజులే.

ఇక ఆయన విచారించిన కేసుల్లో అత్యంత ముఖ్యమైనది అయోధ్య రామజన్మభూమి కేసు. ఈ కేసులో దాదాపు 40 రోజుల పాటు నిత్యమూ విచారించిన ధర్మాసనం, ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో పాటు ఫ్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి 36 రాఫెల్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేసిన కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్ పై, గత లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధానిని 'చౌకీదార్ చోర్ హై' అంటూ వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ కేసుపైనా తీర్పులు వెలువడనున్నాయి.

శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపైనా విచారణ పూర్తయి, తీర్పు పెండింగ్ లో ఉంది. కాగా, దీపావళి సెలవుల తరువాత నవంబర్ 4న సుప్రీంకోర్టు తిరిగి తెరచుకోనుండగా, 11, 12 తేదీల్లో సెలవులున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన కేసులన్నింటిలో గొగోయ్ తీర్పులను వెలువరించనున్నారు.

Ranjan Gogoi
Supreme Court
Retirement
Verdict
  • Loading...

More Telugu News