KRKR: కమ్మరాజ్యంలో కడపరెడ్లు కథను పరిశీలించాకే సినిమా రిలీజ్ కు అనుమతివ్వాలి: బీజేపీ యువ మోర్చా
- కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
- ఆదాయం కోసమే ఇలాంటి టైటిళ్లు పెడుతున్నారని ఆరోపణ
- సామాజిక స్పృహ లేకుండా సినిమాలు తీయొద్దని హితవు
ఏదైనా సినిమాను క్షుణ్ణంగా పరిశీలించాకే విడుదలకు అంగీకరించాలని బీజేపీ యువమోర్చా సెన్సార్ బోర్డును కోరింది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అన్న సినిమా టైటిల్ ప్రజల్లో విద్వేషాలు పెంచేలా పెట్టారని వారు హైదరాబాద్ లోని స్థానిక సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు వివరాలను వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ విద్వేషాలను ఎగదోసేలా ఉందని, టైటిల్ మార్చిన తర్వాతే దీని విడుదలకు అనుమతి ఇవ్వాలని బోర్డును కోరినట్లు తెలిపారు.
సంచలనాలు, ఆదాయంకోసం ఇలాంటి పేర్లు పెడుతున్నారని, సినిమా పేరు మార్చకుంటే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. సామాజిక స్పృహ లేకుండా సినిమాలు తీయవద్దని నిర్మాతలకు సూచించారు. కాగా దర్శకుడు వర్మ తీస్తున్న ఇటీవలి చిత్రాలు ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉన్నవే కావడం గమనార్హం.