Maharashtra: 45 మంది శివసేన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: మహారాష్ట్ర బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలని వారు కోరుకుంటున్నారు
- శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు నచ్చజెప్పి ఒప్పిస్తారు
- ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మరో మార్గం లేదు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తుండడంతో బీజేపీ నేతలు అందుకు ఒప్పుకోవట్లేదు. ఈ విషయంపై బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'మహారాష్ట్రలో శివసేన నుంచి కొత్తగా ఎన్నికైన 45 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాలని వారు కోరుకుంటున్నారు. వీరిలో కొంత మంది ఎమ్మెల్యేలు... శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు నచ్చజెప్పి ఒప్పిస్తారని, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాష్ట్రంలో మరో మార్గం ఉందని నేను భావించట్లేదు' అని సంజయ్ అన్నారు.