Los Angeles: అమెరికాలో కార్చిచ్చుకు తగలబడుతున్న లాస్ ఏంజెలెస్ శివార్లు.. ఖరీదైన ఇళ్లను వదిలి వెళ్తున్న హాలీవుడ్ స్టార్స్
- లాస్ ఏంజెలెస్ శివార్లలో వేగంగా విస్తరిస్తున్న కార్చిర్చు
- స్థానికులను బలవంతంగా తరలిస్తున్న అధికారులు
- ఇక్కడే ఉండేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని అర్నాల్డ్ సూచన
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో మల్టీ మిలియన్ డాలర్ల ఖరీదైన ఐదు భవనాలు బుగ్గైపోయాయి. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలో నివాసం ఉండే పలువురు హాలీవుడ్ స్టార్లు నిన్న అర్ధరాత్రి తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
ఇక్కడి నుంచి తరలి వెళ్లిన వేలాది మందిలో కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ ష్వార్జనెగ్గర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదకరమైన సమయంలో ఇక్కడే ఉండేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని, వెంటనే ఇళ్ల నుంచి బయటకు వచ్చేయాలని సూచించారు. మరోవైపు, ఇళ్లను వీడేందుకు ఒప్పుకోని వారిని అధికారులు బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్ల ద్వారా నీటిని కిందకు చల్లుతున్నారు. భారీ సంఖ్యలో ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్లు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.