Hyderabad: అప్పట్లో నేను స్వామి వారికి కారు డ్రైవర్ గా మారిపోయాను: సీఎం కేసీఆర్
- హైదరాబాద్ వచ్చిన చినజీయర్ స్వామి
- ముచ్చింతల్ ఆశ్రమంలో వేడుకలు
- హాజరైన సీఎం కేసీఆర్
పెద్ద జీయర్ స్వామి వారి జీవిత చరిత్రను తెలిపే 'సత్య సంకల్ప' గ్రంథావిష్కరణ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగింది. ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు కూడా నిర్వహించగా సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చినజీయర్ స్వామి సమక్షంలో కేసీఆర్ మాట్లాడారు.
తనకు చినజీయర్ స్వామితో పరిచయం ఏర్పడింది సిద్ధిపేటలో అని వెల్లడించారు. 1986, 87 ప్రాంతంలో సిద్ధిపేటలో ఆయన బ్రహ్మయజ్ఞం చేయాలని తలపెట్టగా, స్థానికులు తనను సంప్రదించారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. అప్పటికి చినజీయర్ స్వామితో తనకు పరిచయం లేదని, అయితే ఆయన ఎక్కడ బస చేయాలన్న విషయం చర్చకు రాగా తన ఇంట్లోనే ఆయనకు బస ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపానని తెలిపారు.
చినజీయర్ స్వామి అంతటివ్యక్తి తన ఇంట్లో ఉంటానంటే అంతకంటే కావాల్సిందేముందని సంబరపడిపోయానని వెల్లడించారు. తన ఇంట్లో ఉండేందుకు చినజీయర్ స్వామి అనుగ్రహిస్తే ఎంతో ఆనందం కలిగిందని, ఆ వారం రోజులు ఆయన కోసం తాను కారు డ్రైవర్ గా మారానని, అన్ని పనులు చేసిపెట్టానని కేసీఆర్ వివరించారు.
ఆ సమయంలో చినజీయర్ స్వామితో ఎంతో అనుబంధం ఏర్పడిందని, ఆయన చెప్పిన విషయాలు కొన్ని జరగడంతో మరింత నమ్మకం ఏర్పడిందని తెలిపారు. బ్రహ్మ యజ్ఞం జరుగుతుండగా, యాగం మధ్యలో కానీ, ముగింపులో కానీ భారీ వర్షం వస్తుందని స్వామి వారు చెబితే తాము నమ్మలేదని, ఏప్రిల్ నెల, వేసవి కాలంలో ఏం వర్షం పడుతుంది? అని భావించామని అన్నారు. కానీ, చినజీయర్ స్వామి చెప్పినట్టు నిజంగానే వర్షం కురిసిందని, నిజంగా అదో అద్భుతమని సీఎం కేసీఆర్ కొనియాడారు.