Baghdadi: బాగ్దాదీని ఎన్నిసార్లు చంపుతారు?: అమెరికా ప్రకటనపై రష్యా వెటకారం

  • బాగ్దాదీ మరణించినట్టు అమెరికా ప్రకటన  
  • తమకు సమాచారం లేదన్న రష్యా   
  • బాగ్దాదీ బతికుండొచ్చంటున్న రష్యా రక్షణ శాఖ

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీని అంతమొందించినట్టు అమెరికా ఓ ప్రకటనలో పేర్కొనడం తెలిసిందే. దీనిపై రష్యా వ్యంగ్యంగా స్పందించింది. బాగ్దాదీ హతమైనట్టు గతంలోనూ అనేకసార్లు ప్రకటించారంటూ తాజా ప్రకటనను అపహాస్యం చేసింది. అమెరికా సైన్యం దాడుల్లో బాగ్దాదీ హతమైనట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఏదీ లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బాగ్దాదీని ఎన్నిసార్లు చంపుతారంటూ వెటకారం ప్రదర్శించింది.

రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ మీడియాతో మాట్లాడుతూ, సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్ లో అమెరికా దాడులు జరిగినట్టు ఆధారాలు లేవని అన్నారు. బాగ్దాదీ బతికే ఉండొచ్చని భావిస్తున్నామని పేర్కొన్నారు.

విస్మయం కలిగించే అంశం ఏమిటంటే, గతంలో రష్యా దళాలు సిరియాలో దాడులు జరిపినప్పుడు 300 మంది ఐసిస్ ఫైటర్లు హతమయ్యారని, వారిలో బాగ్దాదీ కూడా ఉన్నాడని రష్యా ప్రకటించుకుంది. ఆ సమయంలో అమెరికా కూడా ప్రస్తుతం రష్యా స్పందించిన తీరులోనే వ్యాఖ్యానించింది. బాగ్దాదీ రష్యా దళాల చేతిలో మరణించినట్టు ప్రత్యక్ష సాక్ష్యం ఏదని ప్రశ్నించింది.  ఇప్పుడు రష్యా కూడా తన ప్రత్యర్థి అమెరికాను అదే తరహాలో అవహేళన చేస్తోంది.

  • Loading...

More Telugu News