Arunachal Pradesh: అరుణాచల్ సీఎం పెమాఖండూ సాహస రైడ్
- 16వేల అడుగుల ఎత్తులో ఏటీవీలో ప్రయాణం
- సీఎంతో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
- సరిహద్దు జవాన్లతో కలిసి దీపావళి సంబరాలు
అపురూపమైన పర్యాటక ప్రదేశాలకు పేరుపొందిన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యాటకరంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సీఎం పెమాఖండూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు స్వయంగా పెమాఖండూనే నడుంబిగించారు. మంచుతో కూడిన ఎత్తైన ప్రదేశాల్లో సాహస క్రీడల్లో పాల్గొంటూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
దీపావళి రోజున ఘాట్ రోడ్డులో ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. అయితే ఏంటి.. ఇది సాధారణమే కదా అనుకోకూడదు. సముద్రమట్టం నుంచి 15,600 అడుగుల ఎత్తులో, మంచుకొండల్లో ఆల్ టెరైన్ వెహికల్ (ఏటీవీ) ను 107 కిలోమీటర్ల దూరం నడిపారు. పెమాఖండూతో పాటు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా వెంట ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
భారత్-టిబెట్ సరిహద్దుకు దగ్గరలో తవాంగ్ జిల్లాలోని పీటీఎస్ వో లేక్ నుంచి మాంగో వరకు ఈ వాహనాన్ని నడిపారు. దీపావళి రోజున ఈ సాహసం చేశారు. అనంతరం సరిహద్దు పోస్టుల్లో ఉన్న జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పెమాఖండూ గతంలోను ఇలాంటి సాహసయాత్రలు చేశారు. పాసిఘాట్ ప్రాంతంలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై 122 కిలోమీటర్లు ప్రయాణించారు.
ఖండూపై విశ్వాసంతో పక్కన కూర్చున్నా: రిజిజు
ఈ సాహస యాత్రపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ‘ దాదాపు పదహారు వేల అడుగుల ఎత్తులో ఏటీవీని నడపటం సవాల్ తో కూడుకున్నది. అరుణాచల్ సీఎం పెమాఖండూ వేగంగా, ఒత్తిడికి లోనుకాకుండా నడిపారు. ఆయనపై విశ్వాసంతో నేను పక్కన కూర్చున్నా’ అని ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.