EU: రేపు కశ్మీర్ లో పర్యటించనున్న యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు
- ఇవాళ ప్రధానితో భేటీ అయిన ఐరోపా బృందం
- హర్షం వ్యక్తం చేసిన ప్రధాని
- కశ్మీర్ పరిస్థితుల పట్ల వారికి అవగాహన కలుగుతుందన్న పీఎంఓ
యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం భారత పర్యటనకు విచ్చేసింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఆ బృందం భేటీ అయింది. యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు రేపు జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తారు. కాగా, ఐరోపా పార్లమెంటరీ ప్రతినిధుల భారత్ రాకను ప్రధాని స్వాగతించారు. భారత్ తో సంబంధాల పెంపునకు వాళ్లు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీనిపై స్పందించింది.
భారత్ లో జమ్మూకశ్మీర్ సహా అనేక ప్రాంతాల్లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం పర్యటన సఫలం అవుతుందని భావిస్తున్నామని పేర్కొంది. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యం పట్ల వారికి సరైన అవగాహన కలుగుతుందని అభిప్రాయపడింది. అక్కడ అభివృద్ధి జరుగుతున్న తీరు, పాలనా పరమైన ప్రాధాన్యాల పట్ల వారికి స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుందని పీఎంఓ ట్విట్టర్ లో పేర్కొంది.