California: కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 30 వేల ఎకరాల వృక్ష సంపద బుగ్గిపాలు!
- గంటకు 137 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు
- ఇప్పటి వరకు 50 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించిన గవర్నర్
అమెరికాలోని కాలిఫోర్నియాలో మరోమారు కార్చిచ్చు చెలరేగింది. వేల ఎకరాల్లో వృక్ష సంపద ధ్వంసమైంది. వేలాదిమంది తమ నివాస ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి.
ఇప్పటికే దాదాపు 30 వేల ఎకరాల్లోని వృక్ష సంపదను అగ్ని కీలలు బుగ్గిపాలు చేశాయి. గంటకు 137 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటి వరకు 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించినట్టు గవర్నర్ గేవిన్ న్యూసమ్ తెలిపారు.