rtc: చర్చలు జరుగుతుండగా మేము మధ్యలో వెళ్లిపోలేదు.. ఐఏఎస్ లు అబద్ధాలు చెప్పొద్దు: అశ్వత్థామరెడ్డి
- చర్చలకు మళ్లీ పిలుస్తామన్న అధికారులు పిలవలేదు
- జేఏసీ ఇచ్చిన డిమాండ్లపై చర్చించాలని కోరాం
- ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఎప్పుడు పిలిచినా వెళ్తాం
చర్చలు జరుగుతుండగా మళ్లీ వస్తామని చెప్పి టీఎస్ఆర్టీసి కార్మిక నేతలు వెళ్లిపోయారని, తిరిగి రాలేదని నిన్న అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. నిన్న చర్చల సమయంలో తాము మధ్యలో వెళ్లిపోలేదని, బాధ్యతగల ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెప్పవద్దని అన్నారు. చర్చలకు మళ్లీ పిలుస్తామన్న అధికారులు పిలవలేదని వివరించారు.
జేఏసీ ఇచ్చిన డిమాండ్లపై చర్చించాలని తాము కోరామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఎప్పుడు పిలిచినా వెళ్తామని, రేపు కోర్టు ప్రారంభమయ్యే సమయంలోపు పిలిచినా చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కాగా, కోర్టుకు నివేదిక ఇవ్వాలి కాబట్టే, నామ మాత్రంగా తమను చర్చలకు పిలిచారని కార్మిక నేతలు నిన్న కూడా మీడియాకు తెలిపారు.