Hyderabad: ఏడుగురిని పట్టించిన ఒక్క సెల్ ఫోన్!
- జూబ్లీహిల్స్ సమీపంలో దొంగతనం
- వెంటనే పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
- బైక్ లపై వెళుతున్న నిందితుల అరెస్ట్
ఒక్క సెల్ ఫోన్ దొంగతనం ఏడుగురిని పట్టించింది. హైదరాబాద్, జూబ్లీహిల్స్ క్రైమ్ బ్రాంచ్ విభాగం అధికారులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఏడుగురు స్నేహితులు చెడు అలవాట్లకు బానిసలై, సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో అడ్డదారుల్లోకి నడిచారు. ఈ నెల 19వ తేదీన యూసుఫ్ గూడకు చెందిన సాయిరాం అనే యువకుడు, చెక్ పోస్ట్ కు సమీపంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో నడిచి వెళుతుండగా, ఆ ఏడుగురూ అడ్డగించారు. సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. దీనిపై వెంటనే సాయిరాం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫోన్ నంబర్ ట్రాకింగ్ ఆధారంగా వెంటనే పోలీసులు వారు ఎటువైపు వెళుతున్నారో గుర్తించారు. షేక్ సల్మాన్, అర్భాజ్ ఖాన్, షేక్ గౌస్, మహ్మద్ సల్మాన్, ఖాజా పాషా, జహంగీర్, సయ్యద్ ఇమ్రాన్ లు నిందితులని తేల్చారు. రెండు ద్విచక్ర వాహనాల్లో వస్తున్న ఏడుగురినీ గుర్తించి అరెస్ట్ చేశారు. కేసును విచారిస్తున్నామని, వీరు గతంలో పాల్పడిన నేరాల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.