Nara Lokesh: మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు.. సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా?: నారా లోకేశ్
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారు
- ఇప్పుడు విష జ్వరాలకు ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదు
- ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా? అని ఏడ్చారని... ఇప్పుడు రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదు అని విమర్శించారు. మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి అని చెప్పకోవడానికి మీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు.
మండపేటలో శ్రీనవ్య డెంగీ వ్యాధితో మరణించారని... ఆ బాధతో ఆమె భర్త చందు, కూతురు యోషిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని అన్నారు. దీంతోపాటు, 'నా భార్య వద్దకే వెళ్లిపోతున్నా' అంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన షేర్ చేశారు.