Haryana: హర్యానాలో దెబ్బకొట్టిన ఆరు స్థానాలు.. బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమి!
- మరో 6,877 ఓట్లు వచ్చి ఉంటే గెలుపు
- ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు రాక ఇబ్బంది
- పక్కచూపులు చూడక తప్పని పరిస్థితి
అవసరమైన మెజార్టీకి కావాల్సిన స్థానాలకు కాస్త దూరంలో ఆగిపోవడం... ఆరు స్థానాలు తక్కువ కావడం... ఆరు స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం...దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలను బతిమిలాడుకోక తప్పని పరిస్థితితో హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం, ప్రభుత్వం ఏర్పాటుకు ఆరు స్థానాలే తక్కువ కావడంతో కమలనాథులు తెగ మథనపడిపోతున్నారు. మరికాస్త శ్రమించి ఉంటే అక్కడ కూడా గెలిచేవారమని, ఇప్పుడీ తిప్పలు ఉండేవి కావని భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవారీ, ములానా, నీలోఖేరి, రాదూర్, రోహ్తక్, ఫరీదాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. రేవారీలో 1317, ములానాలో 1688, నీలోఖేరిలో 2222, రాదూర్‌లో 2,541, రోహ్తక్‌లో 2,735, ఫరీదాబాద్‌లో 3,242 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అన్నిచోట్ల కలిపితే ఓట్ల తేడా కేవలం 6,877 మాత్రమే. ఈ మాత్రం ఓట్లు సాధించగలిగి ఉంటే బాగుండేదని ఇప్పుడు బాధపడుతున్నారు.