Kerala: ఆసుపత్రిలో చేరిన కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్.. పరామర్శించిన సీఎం
- అధిక రక్తపోటుతో బాధపడుతున్న మాజీ సీఎం
- వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2006-2011 మధ్య కేరళ సీఎంగా పనిచేసిన అచ్యుతానందన్
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత వీఎస్ అచ్యుతానందన్ నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చేరారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అచ్యుతానందన్ గత ఆదివారమే 96వ పడిలోకి ప్రవేశించారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆసుపత్రికి వెళ్లి అచ్యుతానందన్‌ను పరామర్శించారు. ఏడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన అచ్యుతానందన్ ప్రస్తుతం పాలక్కడ్ జిల్లాలోని మల్లంపూజా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006-2011 మధ్య ఆయన కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు.