Andhra Pradesh: ఏపీలో ఇసుక లేదంటున్నారు.. బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు!: టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్
- వైసీపీ ప్రభుత్వ అసమర్ధత, చేతగాని తనానికి నిదర్శనం
- ఇసుక కొరతను నివారించలేక మాపై నిందలేస్తారా?
- ఇసుక ధర పెరగడం వెనుక మా ప్రమేయం ఏముంది?
ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ అసమర్ధత, చేతగానితనానికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఇసుక కొరతను నివారించడంలో ప్రభుత్వ నిర్వహణ చేతకాక టీడీపీపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉండేదని, ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు చెబుతున్నారని అన్నారు.
ఇసుక ధర పెరగడం వెనుక మా ప్రమేయం ఏముంది? ఇది ఎవరి అసమర్థత? ఎవరి చేతగానితనం? అంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇసుక అంశం చాలా చిన్నది, అలాంటిది ఈ రోజున పెద్ద సమస్యగా తయారైందని, ముప్పై లక్షల భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు రోడ్డునపడ్డాయని విమర్శించారు. ఇసుక కొరత అనేది గతంలో ఎప్పుడూ లేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎందుకు వస్తోందో ఆలోచించాలని కోరారు.
‘ఇసుక అసలు లేదంటున్నారు. కానీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు 16 టైర్స్, 24 టైర్స్ లో వేలాది టన్నుల ఇసుక ఎలా వెళుతోంది? ప్రభుత్వం మద్దతుతో అధికార పార్టీ నాయకులు బ్లాక్ మార్కెట్ లో ఇతర రాష్ట్రాలకు ఇసుకను అమ్ముకుంటున్నారు. సామాన్యుడికి దొరకని ఇసుక వీళ్లకెలా దొరుకుతోంది?’ అని ప్రశ్నించారు.