Twitter: ట్విట్టర్ లో రికార్డులు సృష్టించిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు
- 32 లక్షల ట్వీట్లు పోస్ట్ అయినట్టు గుర్తింపు
- బీజేపీ, శివసేన ట్వీట్లే ఎక్కువ
- రాజకీయ పక్షాలకు బాగా ఉపయోగపడుతున్న ట్విట్టర్
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకు చేరువయ్యేందుకు రాజకీయ పక్షాలకు మరింత సులువైంది. ముఖ్యంగా ట్విట్టర్ లో ఎన్నికల ప్రచారం చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. తాజాగా ముగిసిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు సంబంధించి ట్విట్టర్ లో 32 లక్షల ట్వీట్లు పోస్ట్ అయినట్టు గుర్తించారు. ఇవన్నీ అసెంబ్లీ ఎలక్షన్స్2019 అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లలో బీజేపీ, శివసేన ప్రస్తావనే అధికంగా ఉందట! నేతలకు సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్ లాల్ ఖట్టర్, ఆదిత్య థాకరే, శరద్ పవార్ గురించి ఎక్కువ మంది ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ట్విట్టర్ వర్గాలు స్పందించాయి. రాజకీయాలకు సంబంధించి ఉన్నతమైన వ్యాఖ్యలు చేసేవారికి ట్విట్టర్ సరైన వేదికగా మారిందని ట్విట్టర్ అధికారి పాయల్ కామత్ తెలిపారు.