Pawan Kalyan: జగన్ చేతిలో అధికారం ఉన్నా దోషులను పట్టుకోలేకపోయారు: పవన్ కళ్యాణ్
- ఇక ప్రజలకు ఏం భరోసా ఇస్తారు ..?
- కోడి కత్తి కేసుపై ప్రజల్లో సందేహాలున్నాయి... దాడి చేసిన కుర్రాడిని బెదిరిస్తున్నవాళ్లెవరు?
- చింతమనేనికి పట్టిన గతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికీ పడుతుంది
- వైసీపీ పార్టీ వాళ్ళ కోసమే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ
- నాలుగు నెలల నుంచి 35 లక్షల మంది కార్మికులు, కూలీలను రోడ్డునపడేశారు
- గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పాలు అందించే కార్యక్రమాన్ని నీరుగార్చారు
- అవన్నీ వైసీపీ మద్యం దుకాణాలే
- బలమైన భావజాలం ఉన్న పార్టీలే మనుగడ సాధించాయి
- నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్
ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఐదు నెలలు గడుస్తున్నా సొంత బాబాయిని ఎవరు హత్యచేశారో, కోడి కత్తితో దాడి చేయించింది ఎవరో తెలుసుకోలేని వ్యక్తి ప్రజలకు ఏం భరోసా ఇస్తారని జనసేన పార్టీ అధ్యక్షలు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం మీదే, ముఖ్యమంత్రి కూడా మీరే దోషులను వీలైన త్వరగా పట్టుకోవాలని కోరారు. ఈ కేసులను వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తే ప్రజలు వేరే విధంగా అర్ధం చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, అభ్యర్ధులతో సమావేశం అయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జగన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే ఖండించాను. త్వరగా కోలుకోవాలని ప్రకటన ఇచ్చాను. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే. కోడికత్తితో దాడి చేయడానికి ఆ కుర్రాడిని ప్రేరేపించింది ఎవరు..? బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తుంది ఎవరో కనుక్కోండి. ప్రభుత్వం మీదే ఉంది ఎందుకు పొడిచాడో బయటపెట్టలేకపోతున్నారు.
అడిగేవాళ్ళు లేకపోతే ఇళ్లలోకి వచ్చి కొడతారు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని దారిలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వెళ్తున్నారు. అధికారం ఉంది కదాని మహిళ అధికారిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోండి. అప్రజాస్వామికంగా ముందుకెళ్తే కాలం ఏదో ఒక రోజు శిక్ష విధిస్తుంది. జమీన్ రైతు ఎడిటర్ పైనా మహిళ అధికారి సరళ గారిపై దాడికి పాల్పడిన శ్రీధర్ రెడ్డి కూడా తప్పించుకోలేరు. విలువలకు నిలబడతున్నాను కాబట్టి నెలలు తరబడి నన్ను టీవీల్లో తిట్టారు. అలాగని దాడులు చేస్తామా..?. ఆవేదనను తెలియజేయడానికి ఒక పద్దతి ఉంటుంది.
కానీ శ్రీధర్ రెడ్డి అధికారం ఉంది కదా అని జర్నలిస్టు మీదా, మహిళ అధికారి మీద దాడికి పాల్పడ్డారు. ఆయన జర్నలిస్టు మీద దాడి చేసిన సమయంలోనే ఆయనపై ఏ కేసులుపెట్టలేదు. ఇటువైపు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి మీద బలమైన కేసులు పెట్టారు. మహిళా అధికారిపై దాడులకు పాల్పడిన శ్రీధర్ రెడ్డిని మాత్రం వెంటనే బెయిల్ మీద వదిలేశారు. వీళ్లను అడిగేవారు లేకపోతే ఇళ్లలోకి దూరి కొడతారు. అన్యాయం జరిగితే సైలెంట్ గా కూర్చుంటే పెద్ద తప్పు చేసిన వాళ్లం అవుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన తర్వాత నాకు రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు.
ఇప్పుడు వాగులు వంకలూ తవ్వుకోమంటున్నారు...
ఇసుకను స్వలాభానికి వాడుకొని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నష్టపోయిందో వైసీపీ నాయకులకు కూడా అదే గతి పడుతుంది. ఇసుక విధానం ప్రకటించడానికి మహా అయితే నెల రోజులు పడుతుంది. కానీ నాలుగు నెలలు అవుతున్న సరైన ఇసుక విధానాన్ని ప్రకటించలేదు. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో భవన నిర్మాణ కార్మికులకు అండగా వైజాగ్ లో పాదయాత్ర చేద్దాం అనగానే ముఖ్యమంత్రిగారు హడావుడిగా ఇసుక విధానంపై సమీక్షించారు. ఇసుక ఎక్కడైనా తవ్వుకోండి. ప్రైవేటు భూముల్లో కూడా తవ్వుకోండి.. వాగులు,వంకలు,కాలువలు,డొంకల్లో తవ్వుకొమంటున్నారు. నాలుగు నెలల నుంచి కార్మికులు ఇక్కట్లపాలవుతుంటే పట్టించుకోలేదు. ఈ మాత్రం దానికి నాలుగు నెలలు కార్మికులను హింసించడం ఎందుకు? మద్యపాన నిషేధం విధిస్తే రాష్ట్రానికి ఆదాయం తగ్గాలి. కానీ విచిత్రంగా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతోంది. అంటే ఎక్కువ మంది తాగుతున్నారని అర్ధం. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి. గవర్నమెంట్ షాపులు అని చెప్పి వైసీపీ నాయకుల ప్రాంగణాల్లోనే పెడుతున్నారు. అవి గవర్నమెంట్ షాపులు కాదు వైసీపీ మద్యం షాపులు. రాష్ట్రంలో 55వేల అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు పోషకాహారం అందించాలి. కానీ రెండు నెలలుగా పాల వ్యాపారులకు బకాయిలు చెల్లించకపోవడంతో పాలు ఇవ్వడం నిలిపివేశారు. దానిని పట్టించుకోకుండా ఇప్పుడు వైఎస్సార్ బాల సంజీవని అని 70 చోట్ల పైలెట్ ప్రాజెక్ట్స్ మొదలుపెడుతున్నారు. ఉన్నవి సరిచేయండి కొత్తవి తర్వాత చేద్దురు. యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెబుతున్న ప్రభుత్వం లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడేలా చేసింది. 2.50 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది. వారంతా రోడ్డున పడ్డారు. వైసీపీ గ్రామ వాలంటీర్ల మీద ఎందుకు ఫోకస్ పెట్టిందంటే పార్టీని రక్షించుకోవడానికి కానీ ప్రజలకు అండగా ఉండేందుకు కాదు.
ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజా శ్రేయస్సు కోసమే
తెలుగుదేశం పార్టీ భావజాలం లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడం. వైసీపీ భావజాలం జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండటం. అంతే తప్ప వచ్చే తరానికి ఏమీ చేయాలన్న ఆలోచన లేదు. జనసేన పార్టీ పెట్టినప్పుడే అనుకున్నాను వ్యక్తుల మీద కేంద్రీకృతమైన రాజకీయాలు చేయకూడదని. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ప్రజలకు న్యాయం జరగాలి. అలాంటి భావజాలంతో పార్టీ పెట్టాలి అనుకున్నాను. అధికారం అంతిమ లక్ష్యంగా వచ్చిన అన్ని పార్టీలు కాలగర్భంలో కొట్టుకుపోయాయి. మంచో, చెడో బలమైన భావజాలంతో వచ్చిన పార్టీలో నిలబడ్డాయి. నేను ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకుంటే అది ప్రజా శ్రేయస్సు కోసమే. దాని వెనక జనసేన ఉనికి, రాష్ట్ర, దేశ ప్రయోజనాలు కాపాడుకుంటూ చాలా బలమైన ప్రణాళికతోనే పొత్తు పెట్టుకుంటాం. తెలంగాణ విభజన సమయంలో ఎడ్డెమ్ అంటే తెడ్డెమ్ అనే భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టులు ఏకమయ్యారు. అలాంటిది ప్రజా సమస్యల విషయంలో ఏ పార్టీతోనైనా ఏకం భావన ఆ రోజు కలిగింది.
తుది శ్వాస వరకు పార్టీ నడుపుతాను
అధికారం అంతిమ లక్ష్యం ప్రజలకు మంచి చేయడం కానీ, వేలకోట్లు సంపాదించడం కాదు. నచ్చిన వాళ్లకో, కులానికో, స్నేహితులకో పదవులు పంచడం కోసం కాదు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి అండగా ఉండి కన్నీరు తుడవడం కోసం. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడాన్ని అవమానంగా భావించలేదు. నా పోరాటంలో భాగంగానే భావించాను. ఒక్క ఓటమి నన్ను ఆపలేదు. ఉద్యమంలో ఎన్ని అడుగులు ముందుకు వేశామనే చూసుకోవాలి. ఓడిపోయాం ఇక ఇంతే సంగతులు అని జనసైనికులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీకి 0.8 శాతమే ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి ఓటు శాతం భారీగా తగ్గింది. ఐదేళ్ల పసిబిడ్డ అయిన జనసేన పార్టీకి 7 శాతం ఓటు శాతం వచ్చింది. మనం పోటీ చేసిన చోట మాత్రమే తీసుకుంటే 12 శాతం వచ్చింది. మనకు బలమైన నియోజకవర్గాల్లో 25 శాతం ఓటింగ్ వచ్చింది. పార్టీ నుంచి ఎవరూ వెళ్లి పోయినా నేను మాత్రం నమ్ముకున్న ఆశయం కోసం చివరిశ్వాస వరకు పార్టీని ముందుకు తీసుకెళ్తాను. ముఖ్యంగా జనసైనికులు, నాయకులను ఒకటే కోరుకుంటున్నాను. మీరు ఏదైనా చేయండి కానీ ప్రజలను మాత్రం మోసం చేయకండి. చేయగలిగేదే చెప్పండి. చెప్పేదే చేయండి. చేయలేనప్పుడు ఈ మాట చెప్పాం చేయలేకపోతున్నాం అని ప్రజలను క్షమాపణలు అడగండని అన్నారు.
కార్యకర్తలే జనసేన పార్టీ ఆస్థి: నాదెండ్ల మనోహర్
పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జనసేన పార్టీకి కార్యకర్తలే ఆస్థి. పవన్ కళ్యాణ్ గారు కోరేది అదే అన్నారు. సామాన్యుడికి కూడా అవకాశం ఇచ్చి, ఒక నియోజకవర్గంలో బాధ్యత అప్పగించి ప్రజల తరఫున, పార్టీ తరఫున సమాజానికి ఉపయోగపడేట్లు తయారుచేయాలనే తపనతో పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘమైన ప్రయాణంతో ముందుకు వచ్చారు. మీరంతా దానిని అందిపుచ్చుకొని సమస్యలపై పోరాటం చేయాలని ఆశిస్తున్నాం. గత ఎన్నికల సమయంలో నెల్లూరు జిల్లాలో పొత్తులో భాగంగా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేయలేకపోయాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో జాతీయ పార్టీలైన బి.ఎస్.పి., కమ్యూనిస్టులతో ఆ పొత్తు అనివార్యమైంది. ఇప్పుడు మనం ప్రతి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా ఎదగాలి. అందుకనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయండి. పార్టీ విలువల్ని కాపాడుతూ, ప్రజల మన్ననలు, ఆశీర్వాదం పొందుతూ ముందుకెళ్లాలి. ఇన్ ఛార్జిలుగా నియమితులయ్యేవారికి అండగా ఉంటూ మీరూ ఎదగండి. పార్టీ కోసం కష్టపడి పని చేయాల”న్నారు.