Chalasani Srinivas: తెలుగు వారిని అవమానిస్తే ఊరుకోం: చలసాని శ్రీనివాస్
- బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు
- కడపకు స్టీల్ ఫ్యాక్టరీ తేవాలని డిమాండ్
- కేంద్రంపై జగన్ ఒత్తిడి తేవాలన్న చలసాని
విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ బీజేపీపై విమర్శలు కురిపించారు. బీజేపీ అహంకారంతో వ్యవహరిస్తోందని అన్నారు. తెలుగువారిని అవమానిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నిధులు కేటాయించాలని, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ తేవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. అటు సీఎం జగన్ పైనా చలసాని వ్యాఖ్యలు చేశారు.
కొత్త ప్రభుత్వంపై బాధ్యత ఉందన్న విషయాన్ని జగన్ మర్చిపోతున్నారని, రాష్ట్ర ప్రజల తరఫున విభజన హామీలపై కేంద్రం మీద జగన్ ఒత్తిడి తేవాలని సూచించారు. అంతేగాకుండా, రాష్ట్ర సర్కారు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. విభజన హామీల కోసం మరోసారి ఉద్యమాలు నిర్వహిస్తామని, ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపడతామని, ముందుగా వచ్చే నెలలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయమై జనవరి నుంచి ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిపారు.