Pawan Kalyan: కేవలం టీడీపీపై కక్షతో లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టారు: వైసీపీ సర్కారుపై పవన్ ధ్వజం

  • నెల్లూరు జిల్లా కార్యకర్తలతో పవన్ సమావేశం
  • ఇసుక విధానంలో ఇప్పటికీ ప్రభుత్వానికి స్పష్టతలేదని వ్యాఖ్యలు
  • లక్షల మందికి ఉపాధి లేకుండా చేశారని మండిపాటు

వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన నెల్లూరు జిల్లా జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేవలం టీడీపీపై కక్ష తీర్చుకోవడం కోసం 35 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్కారు నిర్ణయాలు కార్మికులను రోడ్డుపైకి తీసుకువచ్చాయని ఆరోపించారు.

రాత్రికి రాత్రే ఇసుక విధానం తీసివేస్తున్నామని ప్రకటిస్తే కార్మికుల పరిస్థితి ఏమైపోతుందని ప్రశ్నించారు. 15 రోజుల్లో కొత్త విధానం ప్రకటిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానంలో స్పష్టత ఇవ్వడంలేదని విమర్శించారు. ఇసుక సమస్య తీవ్రరూపు దాల్చడంతో తాము సమావేశమై కనీసం ఓ నిరసన యాత్ర చేద్దామని నిర్ణయించుకున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఇవాళ వైసీపీ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం విమర్శలపాలవుతోందని, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న సర్కారు అంతకు ఐదింతల మందికి ఉపాధి లేకుండా అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. తమకు మద్దతు ఇస్తేనే లబ్ది చేకూర్చుతాం, లేకపోతే రోడ్లపై పడేస్తాం అనేలా వైసీపీ వైఖరి ఉందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

Pawan Kalyan
Jana Sena
YSRCP
Jagan
Andhra Pradesh
Nellore District
  • Loading...

More Telugu News