India: సులభతర వాణిజ్యంలో మరో 14 దేశాలను అధిగమించిన భారత్
- 63వ ర్యాంకు సాధించిన భారత్
- గతేడాది భారత్‌కు 77వ ర్యాంకు
- మెరుగైన సామర్థ్యం కనబరిచిన దేశాల్లో టాప్ 10లో భారత్
సులభతర వాణిజ్యంలో భారత్ 63వ ర్యాంకుకు ఎగబాకింది. గతేడాది భారత్ ఒకేసారి 23 ర్యాంకులు మెరుగుపర్చుకొని 77వ స్ధానానికి చేరిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ ఈ రోజు సులభతర వాణిజ్యం ర్యాంకులను ప్రకటించింది. 190 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 14 దేశాలను అధిగమించింది. భారత్ లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన సంస్కరణలతో 63వ ర్యాంకు సాధించింది.
అలాగే, సులభతర వాణిజ్యంలో మెరుగైన సామర్థ్యం కనబరిచిన టాప్ 10 దేశాల జాబితాలో భారత్ పేరు కూడా ఉంది. ఇందులో భారత్‌తో పాటు సౌదీ అరేబియా, జోర్డాన్, టోగో, బహ్రెయిన్, తజికిస్థాన్, పాకిస్థాన్, కువైట్, చైనా, నైజీరియా ఉన్నాయి. 2014లో సులభతర వాణిజ్యంలో 142వ స్ధానంలో ఉండేది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగా భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంటూ వస్తోంది. ఈ జాబితాలో టాప్ 50 దేశాల సరసన చేరడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.