Guntur District: మార్కాపురంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. హడలిపోతున్న జనం
- అర్ధరాత్రి దాటాక అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశం
- ముఖాలకు మాస్క్‌లు, చెడ్డీలు ధరించిన దొంగలు
- ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్న పోలీసులు
గుంటూరు జిల్లా వినుకొండలోని మార్కాపురం రోడ్డులో చొక్కాలు లేకుండా, కేవలం నిక్కర్లు మాత్రమే ధరించిన ముగ్గురు దొంగలు ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించిన వీడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది. వారి వాలకం చూస్తేంటే కచ్చితంగా చెడ్డీగ్యాంగ్ అయి ఉంటుందన్న ప్రచారం జోరందుకోవడంతో నగర వాసులు భయపడుతున్నారు.
బుధవారం తెల్లవారుజామున ముఖాలకు ముసుగు వేసుకుని చెడ్డీలు మాత్రమే ధరించిన ముగ్గురు దొంగలు మార్కాపురం రోడ్డులోని సాయి అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. అప్పుడు సమయం తెల్లవారుజామున మూడు గంటలు. ప్రహరీ నుంచి లోపలికి దిగిన వారిలో ఒకరి చేతిలో రాయి, మిగతా వారి చేతుల్లో రాడ్లు ఉన్నాయి. అనంతరం అపార్ట్‌మెంట్ మొత్తం తిరిగిన దొంగలు కాసేపు సెక్యూరిటీ గార్డు గది వద్ద నిల్చుని ఆపై వెళ్లిపోయారు.
ఉదయం సీసీటీవీ ఫుటేజీ చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకుని పరిశీలించారు. దొంగలు నిక్కర్లు మాత్రమే ధరించి ఉండడంతో అది చెడ్డీగ్యాంగ్ ముఠానే అయి ఉంటుందని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సీఐ చినమల్లయ్య మాట్లాడుతూ.. పట్టణంలో రాత్రివేళ గస్తీని ముమ్మరం చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తామని, ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు తమకు సమాచారం అందిస్తే వారింటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలందరూ ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఐ కోరారు.