cm: నరేగా నిధులు పులివెందుల, పుంగనూరుకే విడుదల చేయడం వివక్ష కాదా?: చంద్రబాబు
- మా హయాంలో ఆదర్శంగా నరేగా పనులు చేశాం
- ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చింది
- చేసిన పనులకు బిల్లులు నిలిపివేయడం దారుణం
టీడీపీ హయాంలో దేశానికే ఆదర్శంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరే) పనులు చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుర్తుచేసుకున్నారు. గత ఐదేళ్లలో రూ.32 వేల కోట్ల నరేగా నిధులు సద్వినియోగం చేసుకున్నామని, కన్వర్జెన్స్ ద్వారా గ్రామాల్లో శాశ్వత ఆస్తులు కల్పించామంటూ వరుస ట్వీట్లు చేశారు.
అలాంటిది, ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చడమే కాకుండా, చేసిన పనులకు బిల్లులు నిలిపివేయడం దారుణమని విమర్శించారు. తమ హయాంలో చేసిన పనులు కళ్లెదుటే కనిపిస్తుంటే ప్రభుత్వం చెల్లింపులు ఎందుకు చేయదు? పనులు చేయించాక బిల్లులు రాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి ఘటనలు ప్రభుత్వానికి కనపడటం లేదా? అని ప్రశ్నించారు.
‘ఇకపై ఎవరూ ఆత్మహత్య చేసుకోకండి. చేసిన పనులకు బిల్లులు పొందడం మీ హక్కు. ఆ హక్కు కోసం పోరాడదాం’ అని చంద్రబాబు పిలుపు నిచ్చారు. నరేగా నిధులు రాష్ట్రం అంతటా నిలిపేసి, కేవలం, పులివెందుల, పుంగనూరుకు మాత్రమే విడుదల చేయడం వివక్ష కాదా? సీఎం, మంత్రి నియోజకవర్గాలకే నిధులు విడుదల చేసి మిగతా రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన రూ.1845 కోట్లకు రాష్ట్రం వాటా రూ.615 కోట్లు కలిపి మొత్తం రూ.2,460 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.