Janasena: ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నా పని అయిపోలేదు: పవన్ కల్యాణ్
- అంతిమశ్వాస వరకు పార్టీని నడుపుతా
- నవంబర్ 3న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో ర్యాలీ
- కేంద్ర మంత్రుల వద్ద సీఎం జగన్ రాష్ట్ర అవసరాలను ప్రస్తావించలేకపోయారు
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని పెట్టానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనంత మాత్రాన తన రాజకీయ జీవితం ముగిసినట్లు కాదన్నారు. ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ‘ప్రజలకోసం ఏదో చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. అంతిమశ్వాస వరకు పార్టీని నడుపుతా, ఎవరికీ తలవంచేది లేదు. మనుషులను గౌరవిస్తా.. నాతో పాటు 25 ఏళ్లు ప్రయాణించే వారు కావాలి’ అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ దక్కించుకోవడంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటే ఇక హామీలను ఎలా సాధిస్తారని జగన్ ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టుల ఆవశ్యకతపై కేంద్ర మంత్రుల వద్ద సరిగ్గా ప్రస్తావించలేకపోయారని విమర్శించారు. సొంత చిన్నాన్న హత్యకు గురైతే.. ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారని ఎత్తిచూపారు.
ఆ సమయంలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్.. అదే మాటపై నిలబడాలని పవన్ డిమాండ్ చేస్తూ.. ఇప్పుడు ఆ కేసును సీబీఐకి ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న వైఖరే కారణమని.. భవన నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న విశాఖలో ర్యాలీ చేపట్టనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.