Telugudesam: టీడీపీ ప్రభుత్వం అప్పులను వారసత్వంగా ఇచ్చింది: ఏపీ మంత్రి బుగ్గన
- నీతి ఆయోగ్ ర్యాంకుల్లో రాష్ట్రం 16కు పడిపోయింది
- ఇందుకు కారణం గత ఆర్థిక మంత్రి యనమల విధానాలే
- ఇసుక కొరత సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం
ఆంధ్రప్రదేశ్ లో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పులను, తీవ్ర గడ్డు పరిస్థితులను వారసత్వంగా తమకు ఇచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈరోజు మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు.
టీడీపీ అప్పులన్నీ తమపైకి నెట్టి విమర్శలకు దిగిందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో రాష్ట్ర స్థానం 16కు పడిపోవడానికి యనమల అనుసరించిన విధానాలే కారణమన్నారు. వారి విధానాల వల్లే ఇసుక కొరత ఏర్పడిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
విద్యుత్ కోతలపై వచ్చిన మీడియా కథనాలను మంత్రి ఖండిస్తూ.. పర్యావరణానికి హాని కలుగుతుందని థర్మల్ విద్యుదుత్పాదనను తగ్గించామన్నారు. ప్రభుత్వ పథకాలపై టీడీపీ అర్థం లేని విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుకు క్రిసిల్ డి రేటింగ్ ఇచ్చిందనడం సరికాదన్నారు.