High Court: డెంగ్యూపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం: తెలంగాణ హైకోర్టు
- రేపు పూర్తి వివరాలతో అధికారులు హాజరు కోవాలని ఆదేశం
- రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ గణాంకాలు మాత్రమే తెలుపుతోంది
- నియంత్రణ చర్యలు అమలు జరగటం లేదన్న ధర్మాసనం
డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రేపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. డెంగ్యూ నియంత్రణకు తీసుకున్న చర్యలు, ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను కోర్టుకు వెల్లడించాలని ఆదేశించింది.
డెంగ్యూ జ్వరాలపై వైద్యురాలు కరుణ హైకోర్టులో కొన్నిరోజుల క్రితం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై కోర్టు అప్పుడే విచారణ ప్రారంభించింది. ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టింది. డెంగ్యూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం స్పందనలేమిని ఆక్షేపించింది. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆచరణ జరగటంలేదని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సమర్పించిన నివేదికలో డెంగ్యూ జ్వరాలకు సంబంధించిన గణాంకాలు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేవని ధర్మాసనం పేర్కొంది.