Jagan: రేపు గన్నవరంలో సీఎం జగన్ పర్యటన.. భద్రతా ఏర్పాట్లలో అధికారులు
- ఏర్పాట్లలో అధికారులు తలమునకలు
- సభాస్థలిని పరిశీలించిన సబ్ కలెక్టర్, డీసీపీ
- సీపెట్ ను ప్రారంభించనున్న సీఎం, కేంద్రమంత్రి సదానందగౌడ
గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలిని, భద్రత ఏర్పాట్లను సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. గన్నవరంలోని సూరంపల్లిలో నిర్మించిన సీపెట్ భవన సముదాయాలను రేపు ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 11.50 గంటల వరకు కొనసాగనుంది.
మంగళవారం సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీసీపీ హర్షవర్ధన్ రాజు సీపెట్ ప్రాంగణాన్ని పరిశీలించారు. వాహనాల పార్కింగ్, వేదిక వద్ద సీట్ల కేటాయింపు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయరాణి, అడిషనల్ డీసీపీ నాగరాజు, సీపెట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మురళీకృష్ణ ఉన్నారు.
ముఖ్యమంత్రి జగన్, కేంద్రమంత్రి సదానందగౌడ సీపెట్ ప్రారంభోత్సవానికి రోడ్డు మార్గంలోనే వస్తారని తహసీల్దార్ వనజాక్షి తెలిపారు. వాతావరణం అనుకూలంగా లేనందున హెలికాప్టర్ లో సీఎంను తీసుకురావడం కుదరదని, రోడ్డు మార్గంలోనే వారిని తీసుకువచ్చేందుకు జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.